Friday, December 30, 2016

తండ్రులూ-కొడుకులూ 

నిహిలిజం... ఇదొక లాటిన్ పదం. అంటే శూన్యం. అంటే పాత వ్యవస్థని నిరాకరించడం.

అనిహిలిస్ట్ అంటే... నిహిలిస్ట్ కాని వాడు అని కాదు. నిర్మూలనా వాది. విధ్వంసవాది.

19వ శతాబ్ది నాటి రష్యన్ సమాజంలోని తరాల అంతరాల తండ్రులూ కొడుకుల వైరుధ్యాన్ని చిత్రిక పట్టాడు ఇవాన్ తుర్గెనేవ్ తన 'తండ్రులూ-కొడుకులూ' నవలలో. ప్రపంచ ప్రఖ్యాతి చెందినదే కాదు, వస్తువు కూడా ప్రపంచ వ్యాప్త తరాల సంఘర్షణ అంశమే.  అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు మాత్రం కాస్త భిన్నంగా తోస్తున్నాయి.

మన తండ్రులూ-కొడుకులూ ... వైరుధ్యాలు, వైవిధ్యాలు, అంతరాలు లేకుండా... అధికారం, డబ్బు, కులం మాత్రమే తరాల అంతరాల్ని చెరిపేసి తండ్రుల్నీ, కొడుకుల్నీ ఒకే పంథాలో నడిపేది, నడుపుతున్నది రెండు తెలుగు రాష్ట్రాలపాలక కుటుంబాల పరిస్థితి.

నాటి రష్యాలో అయినా, నేటి ఉత్తర ప్రదేశ్ లో అయినా... కొన్ని విలువలు, కొన్ని విధానాలు, కొన్ని వైరుధ్యాలు... పుత్ర ప్రీతిని మించిన పాత్ర పోషించడం... ఎందుకో ఆనందం కలిగిస్తున్నది. మన తెలుగు రక్తంలో లేనిదిది!

*

పాత వ్యవస్థల్ని నిరాకరించడం. కొత్త వ్యవస్థల సృష్టికి, ఉన్న విలువల విధ్వంసం.  అందులో అంతస్సంఘర్షణ... అపుడే కొత్త రక్తం. కొత్త వెలుగు.

కొత్త వింతతో... బాధ్యతా రాహిత్యంతో వేసే వెర్రితలలకు పాత భావనల తలంటు... అందులో అంతస్సంఘర్షణ... అపుడే ఓల్డ్ గోల్డ్. తరాల దార్శనికత.

అయినా తెలుగు వాళ్లకు ఇది తెలియదులే!

Long way to go!!

Wednesday, December 14, 2016

Too much!

'...ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో... తోడొకరుండిన అదే భాగ్యము... అదే స్వర్గము...' ఇది అత్యాశే కాదు, దురాశ కూడా. ఎవరి ఆశలు వారివి. ఎవరి కలలు వారివి. ఎవరి కన్నీళ్లు వారివి. అసలు ఆశయాల విషయానికే వస్తే... ఎవరికైనా తమవైన ఖచ్చితమైన ఆశయాలు ఉన్నాయా? ఎప్పటికప్పుడు మారే సిద్ధాంతాలు, అవసరాలు, ఇవే కదా నడిపిస్తాయి. మరొక అడుగు లోతుకు వేస్తే... మారని ఆశయాలు అంటూ ఉండడం సాధ్యమా? అవసరమా? చలనశీలమైన ప్రకృతి, దాని బాబుకంటే చలనశీలమైన ప్రజల మూర్తిమత్వం ముందు ఒక్కరి ఆశలు యెంత? ఎందుకంత పొగరు? వ్యక్తిగత తొక్కలో ఆశలకు మళ్ళీ మరొకరు తోడు ఉండాలట... అందులోనూ... '...నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు...' బొంగేం కాదూ?! ఎవరిని వారే ప్రేమించుకోలేని చోట, బతుకంతా ఇతరుల గురించో వారి పితరుల గురించో... అయితే అభిమానము లేదా అనుమానమూ తప్ప జీవితానందాలూ జీవితాదర్శాలూ ఏవైనా ఏడిసినయా? అంతోటి దానికి మనకోసం ఎవరో కన్నీరు పెట్టుకోవాలా? టూ మచ్ కదా! * పాట బావుంది మెలోడియస్ గా. ఆత్రేయ బాబులా రాసారు శ్రీశ్రీ. అందంగా సాలూరు స్వరపరిస్తే మంద్రంగా ఘంటసాల ఆలపించారు. ఇంతకు మించి ఏమీ లేదు.

Friday, December 2, 2016

హేట్ యూ ప్రేయసీ !

ఎన్ని కలలు నీపై! ప్రజాస్వామ్యానికి, హక్కులకు, ఆర్తులకు నువ్వో దేవతవి. అందుకే నాకు ఏంజిల్ వి.  కానీ, ఇంత విషకన్య ఎలా అయినవ్?

'బయటివారు', 'విదేశీయులు' అని ముద్రపడిన రొహింగీలని హిట్లర్ లా నిర్బంధ శిబిరాలకు తరలిస్తున్నావా? నువ్వేనా?

బామర్ జాత్యహంకారమూ, బౌద్ధ తీవ్రవాదానికి రొహింగీలు.... అందులోని పసిపాపలు కూడా ఇస్లామిక్ మిలిటెంట్ ల లా కనిపిస్తున్నారా? నీ అందమైన కళ్ళు సైనిక కుళ్ళుగా మారాయా?  తరతరాలుగా రఖినే ప్రాంతంలో పదిలక్షలపై చిలుకు ప్రజలు నీ పౌరప్రభుత్వానికి కూడా బయటివారేనా?

నీ పాలనలో కూడా సైన్యం చేతుల్లో హత్యలకూ, అత్యాచారాలకూ గురవుతున్న ప్రజల గురించి మాట్లాడే అంతర్జాతీయ సమాజాన్ని నువ్వూ విమర్శిస్తావా?

నీ నలుపు-తెలుపు తైలవర్ణమే తప్ప కనపడని ఆ గ్రే ఏరియా (పోనీ గ్రే మ్యాటర్) ఇపుడు తెలియడం... భరింపలేకున్నా.

ఎందుకమ్మా... మీ లాంటి ఉద్యమకారులు ఏరు దాటి తెప్ప తగలేస్తారు. మేమూ చూసాం ఒక శిబూ సోరెన్ ని, ఒక కేసీఆర్ నీ.

నీ ఆత్మ వేరు అనుకున్నాం. నీ ఆలోచన వేరు అనుకున్నాం. కానీ నువ్వో ఆ తానులో ఒదిగిపోతే నా గుండె పీలికలు అయిపోతున్నది.

అయిపొయింది. సెలవ్. హేట్ యూ !

పీఎస్: బౌద్ధ తీవ్రవాదం - ఈ పదమే విరోధాభాసలా ఉన్నది.  ప్రేమకూ శాంతికీ ప్రతిరూపమని మేము నమ్మిన ఒక విప్లవకారుడి సిద్ధాంతమూ ఇలా జాత్యహంకారం అయినపుడు... నువ్వెంత?!

http://www.reuters.com/article/us-myanmar-rohingya-idUSKBN13R0BZ

http://www.thehindu.com/opinion/editorial/No-country-for-the-Rohingyas/article16695592.ece

http://www.sakshi.com/news/vedika/myanmar-new-government-has-credibility-428513