Thursday, October 13, 2016

డైలమా లేనివాడే డైలాన్ !

బాబ్ డైలాన్ కు సాహిత్య నోబుల్.

ఈ విషయంపై ఆయన స్పందన ఇంకా తెలీదు. ఇదే ఆయన!

తన ప్రతిష్ట పెరుగుతూ ఉంటే, జనం వెంటబడుతూ ఉంటే ఉప్పొంగి పోలేదాయన. లెజెండా సెలబ్రిటీయా అనే మీమాంస లేదతనికి. పొగడ్తలకు దూరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రుషి.  ఇంగ్లండ్ కు చెందిన వాగ్గేయకారుడు బాబ్ గెల్డాఫ్ లా ఇతనికీ బతికున్నపుడూ, పోయిన తర్వాతా కీర్తి తీరాల మోహం లేదు.

గుండెకోతలూ, మోసాలూ, అకాల మరణాలు, అనైతికత, పౌర హక్కులు, పేదరికం, అణచివేత - ఇవి ఆయన ఇతివృత్తాలు. కళ పరిధిని విస్తరించి, సంగీతానికి ప్రజా సాహిత్యం జోడించిన బాబ్ లానే ఆయనను వరించిన నోబెల్ కూడా తన పరిధిని విస్తరించుకుంది. సాహిత్యానికివ్వాల్సిన బహుమతి సంగీతానికి ఇచ్చి, ఈసారికి సాహితీవేత్తకు అవకాశం దొరక్కుండా చేశారన్న విమర్శలు వినవస్తున్నా... పూవుకు తావి అబ్బినట్టు... సంగీతానికి సాహిత్యాన్ని సమలంకృతం చేసిన బాబ్ డైలాన్ కు నోబెల్ పురస్కారం ఆయనకు మాత్రమే కాదు. నిజానికి ఆయన లక్ష్యపెట్టరు కూడా. ఇది ఆయన సృజనకు నేపథ్యాలైన ప్రజాజీవనానికిచ్చిన గుర్తింపు.

1962 నుంచి ఏకధాటిగా 54 ఏళ్ళపాటు తనను తాను సృష్టించుకుంటున్నాడు. తన సమాజాన్ని తానూ స్పృశిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నాడు. అందుకే బాబ్ డైలాన్ ప్రజా కవిగాయకుడు.

కలాల యుద్ధసైనికులూ రండి
మారుతున్న కాలాన్ని
విశాల నయనాల వీక్షించండి


ప్రజా ప్రతినిధులూ వినండి
బయట యుద్ధం జరుగుతున్నది
దారికి అడ్డు తొలగండి


అంటారు 'For The Times They Are A-Changing' లో...




యెంత మారణహోమం సరిపోతుంది
ఫిరంగి గుళ్ళను నిషేధించడానికి

ఎంతకాలం నిరీక్షించాలి
స్వేచ్చావాయువులు పీల్చడానికి

ఎన్ని సార్లని తలతిప్పుకోవాలి
చుట్టూ అన్యాయాలను గమనించకుండడానికి

జనఘోష వినడానికి
ఎన్ని చెవులు కలిగుండాలి?

వేదన చెందుతారు 'Blowing In The Wind' లో...


యెంత మానవీయత? యెంత ప్రేమ?

భారతీయ, తెలుగు కవులూ కళాకారులారా?  వింటున్నారా?

మమేకమవుతారా జనంతో, లేక మీ వెలుగుజిలుగులలో చరిత్రహీన శలభాలుగా మసైపోతారా?! 

Tuesday, October 4, 2016

నిరాడంబరత ! 

"The cost of being a vegan is a whole lot higher than the cost of being a meat eater not only that but hardworking Americans who have to scrimp and scrape for everything a hard time buying the expensive stuff it takes to be a vegan."
- A netizen from the US

సింపుల్ లివింగ్, నిరాడంబరత్వం ... చాలా కాస్ట్లీ.  గాంధీగారు లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులకు వెళ్ళిన ప్రతిసారి పాలు తాగేందుకు మేకను వెంటబెట్టుకు వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీకీ, బ్రిటిష్ ప్రభుత్వానికీ ఖర్చు ఎక్కువ అవడం మాత్రమే కాదు, లాజిస్టిక్ ప్రాబ్లంస్ చాలా ఉండేవట. కొంచెం కళ్ళు మూసుకుని ఊహించండి, ఎన్నెన్ని తంటాలు పడాలో, ఓ మిల్క్ డబ్బా కొనిపెట్టుకోవడం కంటే?!

ఇదే కాదు, 'నిరాడంబరత' అనేదే ఓ పెద్ద ట్రాప్, బహుదొడ్డ ట్రాష్. వారివల్ల ప్రత్యక్ష కష్టాలు పడడం మాత్రమే కాదు, వారి ఆ 'కీర్తి;ని కూడా జీవితాంతం మనం 'కోటబుల్ కోట్స్'గా చదువుకోవాల్సి వస్తుంది.

ఎవరి అడుగులలోనో నడవాల్సి వస్తుంది. మనం ఏమిటో మర్చిపోయి. అంతా ఫ్యాబ్రికేటెడ్ నాలెడ్జ్ తో మసలుకోవాల్సి వస్తుంది. ఎవరో అల్లే కల్లలకు మనం పందిరి కావలసి వస్తుంది.  వారిని విమర్శించే వారినుంచి వారినీ మననూ రక్షించుకోవడంకోసమే జీవితాన్ని వెచ్చించవలసి వస్తుంది.

వర్తమానంలో మనతో నడుస్తున్నవారినీ, భవిష్యత్తు రోజుల్నీ... గతకాలపు కీర్తిపరుల కళ్ళతో చూడాల్సి వస్తుంది. మొదటి చూపుకంటే ముందే, అంచనా వేయవలసి వస్తుంది. కొత్తదనం లేదు. ఛాలెంజ్ లేదు. నేర్చుకునేది లేదు. నిలవ విధ్వంసులలా మిగిలిపోవలసి వస్తుంది.

కాబట్టి... ఏ విలువలూ, ఏ ఇజాలూ సర్వకాల సర్వావస్తలకు పనికి రావు. అతి డైనమిక్ అయిన జీవనాన్ని ఎప్పటికపుడు పలవరించవలసిందే. పలకరించవలసిందే.

లేకపోతే, నిన్న అవుతాం. మన్నవుతాం.