Saturday, September 24, 2016

నేను, నాతోనే అంతం!

నా మరణంతోనే నేను సమాప్తం. నన్ను ఎవరూ పట్టించుకోవాల్సిన పని లేదు.  ఎవరి పనులు వారు చేసుకోవాలి.
- Bog Geldof (Irish singer and political activist)

నేను కాలగర్భంలో కలిసిపోవాలి. నా పుట్టిన, మరణించిన రోజులు ఎవరూ గుర్తు పెట్టుకోవాల్సిన పని లేదు.
- Lee Kuan Yew (Father of Singapore)

నేను చచ్చిపోయాకే కాదు, బతికున్నపుడు కూడా ఎవరూ గుర్తించనక్కరలేదు. ఏం పని?
- RGV

మొదటిసారి ఆ మాట బాబ్ నోట విన్నపుడు మతిపోయింది నాకు. 2006 ప్రాంతంలో బ్రిటన్ సహా తెల్లదేశాల నుండి 18 ఆఫ్రికా దేశాలను రుణవిముక్తి చేసే 'మేక్ పావర్టీ హిస్టరీ' ఉద్యమ రూపకర్త బాబ్ గెల్దాఫ్. లిబరల్ డెమొక్రాట్స్ పార్టీ సభ్యుడిగా ఇంగ్లండ్ లో జీవిస్తున్న నేను ఆ ఉద్యమంలో పాలుపంచుకోవడం... స్కాట్లాండ్ వీధుల్లో చేసిన ప్రదర్శనలు, జీ-8 దేశాధినేతలకు (మన్మోహన్ కూడా ఉన్నారక్కడ) ఇచ్చిన రిప్రజేంటేషన్ అదో మైమరపు. ఒక సింగర్ ఇంత పెద్ద ఉద్యమం, ఇంత చైతన్యం, ఇంత నిబద్ధత... ఆల్రెడీ ఆయన ప్రేమలో పడిపోయిన నాకు... "నా మరణంతోనే నేను సమాప్తం. నన్ను ఎవరూ పట్టించుకోవాల్సిన పని లేదు.  ఎవరి పనులు వారు చేసుకోవాలి" అనడంతో నిజంగా మతిపోయింది. ఎవడ్రా వీడు?  కృష్ణుడి గురించి నేను ఎపుడూ అనుకునే 'ఎవడ్రా వీడు' అది.

'తానున్నా లేకున్నా తనపేరు మిగలాలి' లాంటి పాటలు విని, 'నాకేమీ వద్దు, నా జనం నన్ను గుర్తుంచుకుంటే చాలు' అని మన మహామహా నాయకులు చెప్పిన ఆదర్శాలు కని ఉన్న నాకు అది ఒక కొత్త అనుభవం.

*

మళ్ళీ దశాబ్దం (2015) తర్వాత సింగపూర్ 'లీ' అదే తాత్వికత.

ఆ తర్వాత మరో సంవత్సరం తర్వాత రాంగోపాల్ వర్మ... అదే తాత్వికత.

ఎవండ్లురా వీండ్లు?!

*

మెటీరియల్ సుఖాల కోసం తపించడం కన్నా కీర్తి కండూతి చాలా ప్రమాదం. కీర్తి, కాంత, కనకాల్లో కీర్తి వాంఛ బహు దుర్మార్గం. మెటీరియల్ సుఖాలకు పరిమితులుంటాయి. పరిస్థితులుంటాయి. మొహం మొత్తడం ఉంటుంది. ఒకచోట ఆగిపోవటం ఉంటుంది.

కీర్తి అలా కాదు.

తామున్న కాలంలో మంచో చెడో చేసి సమాజం సమాజాన్నే ప్రభావితం చేసి, విజేతలుగా ఎదిగి, స్వీయ చరిత్రలు లిఖించుకుని, తిమ్మిని బమ్మి చేసి, చరిత్ర పుటల్లో నిలిచిపోవడం వెనుక యెంత కుట్ర, యెంత అన్యాయ విఖ్యాతి, యెంత కర్కశత్వం?!

పోనీ, పులుగడిగిన ముత్యాలు (?) అని ప్రజలు అనుకునే వారి విషయంలో కూడా ఇది చాలా ప్రమాదం. తమ అభిమాన నాయకులు అనివార్యంగానో సహజంగానో ఎపుడో చేసిన 'మంచి' పనులను చెప్పుకుంటూ, వారిమీద ఈగ వాలనివ్వక; వారు బతికున్నపుడూ, పోయిన తరువాతా వారి నామస్మరణలో వర్తమాన వాస్తవాల నగ్నత్వాన్ని దాచేస్తూ - నాటి చెట్టుపేర నేటి కుక్కమూతి పిందెలను అమ్ముకోవడం మన ఎరుకలోనిదే. ఇదే 'కీర్తి' వల్ల జరిగే నష్టం.

*

ఈ భూమి పుట్టి 300 కోట్ల సంవత్సరాలు. మరో అంతేకాలం ఈ భూమి మనుగడలో ఉండొచ్చు. మరి ఈ అనంతకాల గమనంలో మనిషి రవంత జీవన పయనం ఓ లెక్కలోనిదా?  వాడికి లెక్క ఉండాలా? బతికినా, పోయినా?

అన్యాయం కదూ?!

పీఎస్: ప్రతిదానికీ ఒక రైడర్ ఉంటుంది. మన సహా ఎవరి 'ఫేం'ను అయినా, మనం జీవిస్తున్న కాలంలో నాలుగు మంచి పనులు చేయడానికి మాత్రం నిస్సందేహంగా ఉపయోగించుకోవచ్చు.

https://www.facebook.com/Srisail.Reddy.P
srisail@gmail.com