Tuesday, November 29, 2016

ఉలిపి కట్టెలకు స్వాగతం ! 

ఈ ప్రపంచం లేదా మరే యితర ప్రపంచం అయినా ప్రశ్నతోనే పురోగతి చెందింది. చెందుతుంది. మరొక షార్ట్ కట్ లేదు. తత్వమైనా, భౌతికమైనా, రసాయనమైనా, రాజకీయమైనా, సైద్ధాంతికమైనా, ఆర్ధికమైనా... ఇంకా పేరు పెట్టని, తెలియని మరేవైనా... యథాతథస్థితిని ధిక్కరించే వారితోనే, నిలువనీతుల దుంపతెంచినవారితోనే జీవులకు మేలు జరిగింది. నేను కాన్షియస్ గానే 'మానవాళికి మేలు జరిగింది' అనడం లేదు, మనుషులొక్కటే సర్వం కాదు కాబట్టి.

ప్రయోక్తలూ, ప్రయోగకర్తలూ తమ కొత్తదనపు ప్రతిపాదనల ఫలితం అనుభవించారు. కొరత వేయబడ్డారు. రాళ్ళతో కొట్టించుకున్నారు. దేశాల బహిష్కరణలు గురయ్యారు. విషప్రయోగాలకు తనువులు చాలించారు, 'విజ్ఞుల' హేళనకు గురైనారు. కానీ, ఊరి దారిలో నడవని ఆ ఉలిపికట్టెల ప్రతిపాదనల సత్ఫలితాలు పరిణామక్రమంలో ప్రపంచానికి అందినాయి. నిజానికి అదే పరిణామక్రమం అయింది, పరిమాణంతో ఏం?!

నిన్నమొన్నటి వార్తల్లో ఒక ఫిడేల్ క్యాస్ట్రో మరోసారి ముందుకు వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగలో ఉన్న, 'తీవ్రవాద రాజకీయాలతో' సంబంధం లేని (నిజానికి అసహ్యించుకునే) ఓ మితృడు - '638 సార్లు హత్యాప్రయత్నమా? పైగా శతృవు అమెరికానా?' అంటూ మెరిసే కళ్ళతో అభిమానాలు పోయాడు నా దగ్గర. 'వీడు ఏం మనిషి సర్' అన్నాడు... 'అతడు' సినిమాలో 'గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు, ఇటుక మీద ఇటుక పేర్చినట్టు ఏం కొట్టాడు' అంటూ మహేష్ బాబుకు కళ్ళతోనే సన్మానం చేసిన భరణిలా!

జనమంతా నిర్బంధ దేశభక్తికి గురౌతున్న వేళ... 'నల్ల'దొరలకు సంబంధం లేని, అవసరం లేని, ప్రమేయం లేని, నష్టం లేని, బాధ లేని, బాధ్యత లేని సమరంలోకి సామాన్యుడు బలవంతంగా లాగబడుతున్న వేళ... దేశ ప్రధాని పార్లమెంటుకు బాధ్యత పడనివేళ, ప్రజలే ఈ ప్రక్షాళనా యుద్ధపు సాగరంలోకి తోయబడ్డారు.

ఒక మాయావతి, ఒక మమత, ఒక కేజ్రీవాల్ ఉలిపికట్టెలలా దారిమార్చారు. నిలదీస్తున్నారు. ఉధృత ఒరవడిలో దిక్కూమోక్కూగానని వారికి,  బలవంతపు ఈదులాటకు గురైన వారికి గడ్డిపోచలై ఆశలు కనిపిస్తున్నారు. వీరి విజయం ఒక్కటే. ఇంతటి 'విప్లవాత్మకనిర్ణయాన్ని' ఎదిరిస్తే అవినీతిపరులు అనే ముద్ర వేస్తారేమో అనే నైతిక సందిగ్దతను జయించటమే. ఈ దరిదాపుల్లో కూడా లేని, రాలేని తెలుగు ముఖ్యమంత్రుల గురించి మాటలే అనవసరం.

వేయి ఆలోచనలు, నూరు వికసించే పూలు, ఒక్క ప్రశ్న, సగం తిరుగుబాటు, అంకురిద్దామా వద్దా అనే సంశయంతోనైనా సరే ఉనికిపోసుకుంటున్న భిన్నత్వం... ఇవే నేలను సారవంతం చేయగలిగేవి.   పరువు బరువుల ఎరువులు కాదు.

ప్రజాస్వామ్యంపై, చర్చపై, ఏమాత్రం విశ్వాసం లేని ఒక అహంకార ప్రధాని, ప్రజల అవసరాలపై అవగాహన లేని, లక్ష్యంలేని ఒక నిర్దయుడు, రోడ్డురోలర్ మెజారిటీతో మిడిసిపడే ఒక మెగలోమేనిక్ నాయకుడి బారినుండి దేశప్రజలకు రక్షణ నేటి అవసరం. అది 'దేశభక్తిపైని భక్తి'ని చేధించుకు వచ్చే నికార్సైన దేశభక్తితోనే సాధ్యం.  ప్రశ్నతోనే సాధ్యం.

ప్రశ్న వర్ధిల్లాలి. ఉలిపికట్టెలు విలసిల్లాలి. 

2 comments:

  1. ఒక పాముని చంపాలంటేనే అనేక చీమలు ఏకం కావాలి. అలాంటిది ఉన్న పాములన్నీ ఐక్యంగా ఉన్నప్పుడు ఎన్నివేల లక్షల చీమల ఐకమత్యం అవసరమవుతుందో అంచనా వేయండి. లెఫ్టిస్ట్ శక్తుల ఐకమత్యం నా లాంటి ప్రతి చీమకూ అవసరం కావాలి.

    ReplyDelete
  2. నిజం ప్రసాద్ గారూ.

    ReplyDelete