Thursday, October 13, 2016

డైలమా లేనివాడే డైలాన్ !

బాబ్ డైలాన్ కు సాహిత్య నోబుల్.

ఈ విషయంపై ఆయన స్పందన ఇంకా తెలీదు. ఇదే ఆయన!

తన ప్రతిష్ట పెరుగుతూ ఉంటే, జనం వెంటబడుతూ ఉంటే ఉప్పొంగి పోలేదాయన. లెజెండా సెలబ్రిటీయా అనే మీమాంస లేదతనికి. పొగడ్తలకు దూరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రుషి.  ఇంగ్లండ్ కు చెందిన వాగ్గేయకారుడు బాబ్ గెల్డాఫ్ లా ఇతనికీ బతికున్నపుడూ, పోయిన తర్వాతా కీర్తి తీరాల మోహం లేదు.

గుండెకోతలూ, మోసాలూ, అకాల మరణాలు, అనైతికత, పౌర హక్కులు, పేదరికం, అణచివేత - ఇవి ఆయన ఇతివృత్తాలు. కళ పరిధిని విస్తరించి, సంగీతానికి ప్రజా సాహిత్యం జోడించిన బాబ్ లానే ఆయనను వరించిన నోబెల్ కూడా తన పరిధిని విస్తరించుకుంది. సాహిత్యానికివ్వాల్సిన బహుమతి సంగీతానికి ఇచ్చి, ఈసారికి సాహితీవేత్తకు అవకాశం దొరక్కుండా చేశారన్న విమర్శలు వినవస్తున్నా... పూవుకు తావి అబ్బినట్టు... సంగీతానికి సాహిత్యాన్ని సమలంకృతం చేసిన బాబ్ డైలాన్ కు నోబెల్ పురస్కారం ఆయనకు మాత్రమే కాదు. నిజానికి ఆయన లక్ష్యపెట్టరు కూడా. ఇది ఆయన సృజనకు నేపథ్యాలైన ప్రజాజీవనానికిచ్చిన గుర్తింపు.

1962 నుంచి ఏకధాటిగా 54 ఏళ్ళపాటు తనను తాను సృష్టించుకుంటున్నాడు. తన సమాజాన్ని తానూ స్పృశిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నాడు. అందుకే బాబ్ డైలాన్ ప్రజా కవిగాయకుడు.

కలాల యుద్ధసైనికులూ రండి
మారుతున్న కాలాన్ని
విశాల నయనాల వీక్షించండి


ప్రజా ప్రతినిధులూ వినండి
బయట యుద్ధం జరుగుతున్నది
దారికి అడ్డు తొలగండి


అంటారు 'For The Times They Are A-Changing' లో...




యెంత మారణహోమం సరిపోతుంది
ఫిరంగి గుళ్ళను నిషేధించడానికి

ఎంతకాలం నిరీక్షించాలి
స్వేచ్చావాయువులు పీల్చడానికి

ఎన్ని సార్లని తలతిప్పుకోవాలి
చుట్టూ అన్యాయాలను గమనించకుండడానికి

జనఘోష వినడానికి
ఎన్ని చెవులు కలిగుండాలి?

వేదన చెందుతారు 'Blowing In The Wind' లో...


యెంత మానవీయత? యెంత ప్రేమ?

భారతీయ, తెలుగు కవులూ కళాకారులారా?  వింటున్నారా?

మమేకమవుతారా జనంతో, లేక మీ వెలుగుజిలుగులలో చరిత్రహీన శలభాలుగా మసైపోతారా?! 

No comments:

Post a Comment