Wednesday, January 25, 2017

WE, THE PEOPLE OF INDIA



WE, THE PEOPLE OF INDIA, having solemnly
resolved to constitute India into a 
SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC
and to secure to all its citizens:
JUSTICE, social, economic and political;
LIBERTY of thought, expression, belief, faith and worship;
EQUALITY of status and of opportunity;
and to promote among them all FRATERNITY assuring the dignity of the individual
and the unity and integrity of the Nation;
IN OUR CONSTITUENT ASSEMBLY this twenty sixth day of November, 1949, do HEREBY ADOPT,
ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.


భారత రాజ్యాంగ పీఠిక అది! 

ఆత్మ ఇక్కడ ఉన్నది : JUSTICE * LIBERTY * EQUALITY * FRATERNITY 

"భారతదేశ ప్రజలమైన మేము ఈ భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపొందించుకుని భారత పౌరులందరికీ :
  • సాంఘిక, ఆర్ధిక, రాజకీయ 'న్యాయాన్ని'; 
  • ఆలోచనలోనూ, భావ ప్రకటనలోనూ, మత విశ్వాసాలలోనూ, ఆరాధన లోనూ 'స్వేచ్చను'; 
  • జీవిత అవకాశాలలో, సామాజిక విషయాలలో, 'సమానత్వాన్ని';
  • వ్యక్తి గౌరవాన్ని, జాతీయ ఐక్యతను సమగ్రతను పెంపొందించుకునే విధంగా 'సౌభ్రాతృత్వాన్ని';
కల్పించి, ఈ రాజ్యాంగ పరిషత్తులో తీర్మానించి, చట్టరూపంలో పరిగ్రహించి మాకు మేము 26 నవంబరు 1949 నాడు సమర్పించుకుంటున్నాము."

*

ఎవరు రాయగలరు ఇంతకంటే మానవీయమైన మహాభారతాన్ని? ఎవరు స్వప్నించగలరు ఇంతకంటే గొప్ప దేశాన్ని!

మీరే. నేనే.

అవును. 24,533 రోజుల క్రితం (67 ఏళ్ళ క్రితం) చేసుకున్న బాసలు అవి. ఆ తర్వాత మరో అరవై రోజులకు ఆచరణకు సిద్దమైన సందర్భం అది. నాడు మీరు ఉన్నారు. నేనూ ఉన్నాను. భారతీయాత్మ ఉంది. అది కాలానికి అతీతం. ఒక్కసారి కళ్ళుమూసుకుని ఆ రోజుకు వెళ్ళండి.  

మళ్ళీ వర్తమానంలోకి రండి. 

ఈ రోజు నుంచి రాబోయే కాలాలకు మన, మన పిల్లల, వారి పిల్లల భవిష్యత్తు కనిపిస్తుంది. అందులో మన పాత్ర కనిపిస్తుంది - కాలానికి అతీతంగా. 

కర్తవ్యమూ తెలుస్తుంది. 

'ఈ రాజ్యాంగం ఆచరణ సాధ్యం. సంక్షోభంలోనూ, సంతోషంలోనూ ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచే శక్తీ, వెసులుబాటూ దీనికి ఉందని నమ్ముతున్నాను నేను. దురదృష్టవశాత్తు అవాంఛనీయ పరిణామాలు జరిగితే దానికి కారణం రాజ్యాంగం కాదు. మానవతప్పిదాలే' అన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్.

నేడు ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోకన్నా మిన్నగా ఈ దేశప్రజలకు దక్కాల్సినవి ఏమిటో స్ఫటిక స్పష్టంగా చెప్పింది మన రాజ్యాంగం. రాజకీయ పార్టీలు సహా అన్ని వ్యవస్థలూ ఇందుకు లోబడి పనిచేసే అనివార్యతను కల్పించే విషయంలో రాజీ పడవద్దు. అప్రమత్తంగా ఉందాం. అది మన బాధ్యత. హక్కు కూడా.

గణతంత్ర దిన శుభాకాంక్షలు.  జై హింద్! 

Friday, December 30, 2016

తండ్రులూ-కొడుకులూ 

నిహిలిజం... ఇదొక లాటిన్ పదం. అంటే శూన్యం. అంటే పాత వ్యవస్థని నిరాకరించడం.

అనిహిలిస్ట్ అంటే... నిహిలిస్ట్ కాని వాడు అని కాదు. నిర్మూలనా వాది. విధ్వంసవాది.

19వ శతాబ్ది నాటి రష్యన్ సమాజంలోని తరాల అంతరాల తండ్రులూ కొడుకుల వైరుధ్యాన్ని చిత్రిక పట్టాడు ఇవాన్ తుర్గెనేవ్ తన 'తండ్రులూ-కొడుకులూ' నవలలో. ప్రపంచ ప్రఖ్యాతి చెందినదే కాదు, వస్తువు కూడా ప్రపంచ వ్యాప్త తరాల సంఘర్షణ అంశమే.  అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు మాత్రం కాస్త భిన్నంగా తోస్తున్నాయి.

మన తండ్రులూ-కొడుకులూ ... వైరుధ్యాలు, వైవిధ్యాలు, అంతరాలు లేకుండా... అధికారం, డబ్బు, కులం మాత్రమే తరాల అంతరాల్ని చెరిపేసి తండ్రుల్నీ, కొడుకుల్నీ ఒకే పంథాలో నడిపేది, నడుపుతున్నది రెండు తెలుగు రాష్ట్రాలపాలక కుటుంబాల పరిస్థితి.

నాటి రష్యాలో అయినా, నేటి ఉత్తర ప్రదేశ్ లో అయినా... కొన్ని విలువలు, కొన్ని విధానాలు, కొన్ని వైరుధ్యాలు... పుత్ర ప్రీతిని మించిన పాత్ర పోషించడం... ఎందుకో ఆనందం కలిగిస్తున్నది. మన తెలుగు రక్తంలో లేనిదిది!

*

పాత వ్యవస్థల్ని నిరాకరించడం. కొత్త వ్యవస్థల సృష్టికి, ఉన్న విలువల విధ్వంసం.  అందులో అంతస్సంఘర్షణ... అపుడే కొత్త రక్తం. కొత్త వెలుగు.

కొత్త వింతతో... బాధ్యతా రాహిత్యంతో వేసే వెర్రితలలకు పాత భావనల తలంటు... అందులో అంతస్సంఘర్షణ... అపుడే ఓల్డ్ గోల్డ్. తరాల దార్శనికత.

అయినా తెలుగు వాళ్లకు ఇది తెలియదులే!

Long way to go!!

Wednesday, December 14, 2016

Too much!

'...ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో... తోడొకరుండిన అదే భాగ్యము... అదే స్వర్గము...' ఇది అత్యాశే కాదు, దురాశ కూడా. ఎవరి ఆశలు వారివి. ఎవరి కలలు వారివి. ఎవరి కన్నీళ్లు వారివి. అసలు ఆశయాల విషయానికే వస్తే... ఎవరికైనా తమవైన ఖచ్చితమైన ఆశయాలు ఉన్నాయా? ఎప్పటికప్పుడు మారే సిద్ధాంతాలు, అవసరాలు, ఇవే కదా నడిపిస్తాయి. మరొక అడుగు లోతుకు వేస్తే... మారని ఆశయాలు అంటూ ఉండడం సాధ్యమా? అవసరమా? చలనశీలమైన ప్రకృతి, దాని బాబుకంటే చలనశీలమైన ప్రజల మూర్తిమత్వం ముందు ఒక్కరి ఆశలు యెంత? ఎందుకంత పొగరు? వ్యక్తిగత తొక్కలో ఆశలకు మళ్ళీ మరొకరు తోడు ఉండాలట... అందులోనూ... '...నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు...' బొంగేం కాదూ?! ఎవరిని వారే ప్రేమించుకోలేని చోట, బతుకంతా ఇతరుల గురించో వారి పితరుల గురించో... అయితే అభిమానము లేదా అనుమానమూ తప్ప జీవితానందాలూ జీవితాదర్శాలూ ఏవైనా ఏడిసినయా? అంతోటి దానికి మనకోసం ఎవరో కన్నీరు పెట్టుకోవాలా? టూ మచ్ కదా! * పాట బావుంది మెలోడియస్ గా. ఆత్రేయ బాబులా రాసారు శ్రీశ్రీ. అందంగా సాలూరు స్వరపరిస్తే మంద్రంగా ఘంటసాల ఆలపించారు. ఇంతకు మించి ఏమీ లేదు.

Friday, December 2, 2016

హేట్ యూ ప్రేయసీ !

ఎన్ని కలలు నీపై! ప్రజాస్వామ్యానికి, హక్కులకు, ఆర్తులకు నువ్వో దేవతవి. అందుకే నాకు ఏంజిల్ వి.  కానీ, ఇంత విషకన్య ఎలా అయినవ్?

'బయటివారు', 'విదేశీయులు' అని ముద్రపడిన రొహింగీలని హిట్లర్ లా నిర్బంధ శిబిరాలకు తరలిస్తున్నావా? నువ్వేనా?

బామర్ జాత్యహంకారమూ, బౌద్ధ తీవ్రవాదానికి రొహింగీలు.... అందులోని పసిపాపలు కూడా ఇస్లామిక్ మిలిటెంట్ ల లా కనిపిస్తున్నారా? నీ అందమైన కళ్ళు సైనిక కుళ్ళుగా మారాయా?  తరతరాలుగా రఖినే ప్రాంతంలో పదిలక్షలపై చిలుకు ప్రజలు నీ పౌరప్రభుత్వానికి కూడా బయటివారేనా?

నీ పాలనలో కూడా సైన్యం చేతుల్లో హత్యలకూ, అత్యాచారాలకూ గురవుతున్న ప్రజల గురించి మాట్లాడే అంతర్జాతీయ సమాజాన్ని నువ్వూ విమర్శిస్తావా?

నీ నలుపు-తెలుపు తైలవర్ణమే తప్ప కనపడని ఆ గ్రే ఏరియా (పోనీ గ్రే మ్యాటర్) ఇపుడు తెలియడం... భరింపలేకున్నా.

ఎందుకమ్మా... మీ లాంటి ఉద్యమకారులు ఏరు దాటి తెప్ప తగలేస్తారు. మేమూ చూసాం ఒక శిబూ సోరెన్ ని, ఒక కేసీఆర్ నీ.

నీ ఆత్మ వేరు అనుకున్నాం. నీ ఆలోచన వేరు అనుకున్నాం. కానీ నువ్వో ఆ తానులో ఒదిగిపోతే నా గుండె పీలికలు అయిపోతున్నది.

అయిపొయింది. సెలవ్. హేట్ యూ !

పీఎస్: బౌద్ధ తీవ్రవాదం - ఈ పదమే విరోధాభాసలా ఉన్నది.  ప్రేమకూ శాంతికీ ప్రతిరూపమని మేము నమ్మిన ఒక విప్లవకారుడి సిద్ధాంతమూ ఇలా జాత్యహంకారం అయినపుడు... నువ్వెంత?!

http://www.reuters.com/article/us-myanmar-rohingya-idUSKBN13R0BZ

http://www.thehindu.com/opinion/editorial/No-country-for-the-Rohingyas/article16695592.ece

http://www.sakshi.com/news/vedika/myanmar-new-government-has-credibility-428513

Tuesday, November 29, 2016

ఉలిపి కట్టెలకు స్వాగతం ! 

ఈ ప్రపంచం లేదా మరే యితర ప్రపంచం అయినా ప్రశ్నతోనే పురోగతి చెందింది. చెందుతుంది. మరొక షార్ట్ కట్ లేదు. తత్వమైనా, భౌతికమైనా, రసాయనమైనా, రాజకీయమైనా, సైద్ధాంతికమైనా, ఆర్ధికమైనా... ఇంకా పేరు పెట్టని, తెలియని మరేవైనా... యథాతథస్థితిని ధిక్కరించే వారితోనే, నిలువనీతుల దుంపతెంచినవారితోనే జీవులకు మేలు జరిగింది. నేను కాన్షియస్ గానే 'మానవాళికి మేలు జరిగింది' అనడం లేదు, మనుషులొక్కటే సర్వం కాదు కాబట్టి.

ప్రయోక్తలూ, ప్రయోగకర్తలూ తమ కొత్తదనపు ప్రతిపాదనల ఫలితం అనుభవించారు. కొరత వేయబడ్డారు. రాళ్ళతో కొట్టించుకున్నారు. దేశాల బహిష్కరణలు గురయ్యారు. విషప్రయోగాలకు తనువులు చాలించారు, 'విజ్ఞుల' హేళనకు గురైనారు. కానీ, ఊరి దారిలో నడవని ఆ ఉలిపికట్టెల ప్రతిపాదనల సత్ఫలితాలు పరిణామక్రమంలో ప్రపంచానికి అందినాయి. నిజానికి అదే పరిణామక్రమం అయింది, పరిమాణంతో ఏం?!

నిన్నమొన్నటి వార్తల్లో ఒక ఫిడేల్ క్యాస్ట్రో మరోసారి ముందుకు వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగలో ఉన్న, 'తీవ్రవాద రాజకీయాలతో' సంబంధం లేని (నిజానికి అసహ్యించుకునే) ఓ మితృడు - '638 సార్లు హత్యాప్రయత్నమా? పైగా శతృవు అమెరికానా?' అంటూ మెరిసే కళ్ళతో అభిమానాలు పోయాడు నా దగ్గర. 'వీడు ఏం మనిషి సర్' అన్నాడు... 'అతడు' సినిమాలో 'గులాబీ మొక్కకు అంటుకట్టినట్టు, ఇటుక మీద ఇటుక పేర్చినట్టు ఏం కొట్టాడు' అంటూ మహేష్ బాబుకు కళ్ళతోనే సన్మానం చేసిన భరణిలా!

జనమంతా నిర్బంధ దేశభక్తికి గురౌతున్న వేళ... 'నల్ల'దొరలకు సంబంధం లేని, అవసరం లేని, ప్రమేయం లేని, నష్టం లేని, బాధ లేని, బాధ్యత లేని సమరంలోకి సామాన్యుడు బలవంతంగా లాగబడుతున్న వేళ... దేశ ప్రధాని పార్లమెంటుకు బాధ్యత పడనివేళ, ప్రజలే ఈ ప్రక్షాళనా యుద్ధపు సాగరంలోకి తోయబడ్డారు.

ఒక మాయావతి, ఒక మమత, ఒక కేజ్రీవాల్ ఉలిపికట్టెలలా దారిమార్చారు. నిలదీస్తున్నారు. ఉధృత ఒరవడిలో దిక్కూమోక్కూగానని వారికి,  బలవంతపు ఈదులాటకు గురైన వారికి గడ్డిపోచలై ఆశలు కనిపిస్తున్నారు. వీరి విజయం ఒక్కటే. ఇంతటి 'విప్లవాత్మకనిర్ణయాన్ని' ఎదిరిస్తే అవినీతిపరులు అనే ముద్ర వేస్తారేమో అనే నైతిక సందిగ్దతను జయించటమే. ఈ దరిదాపుల్లో కూడా లేని, రాలేని తెలుగు ముఖ్యమంత్రుల గురించి మాటలే అనవసరం.

వేయి ఆలోచనలు, నూరు వికసించే పూలు, ఒక్క ప్రశ్న, సగం తిరుగుబాటు, అంకురిద్దామా వద్దా అనే సంశయంతోనైనా సరే ఉనికిపోసుకుంటున్న భిన్నత్వం... ఇవే నేలను సారవంతం చేయగలిగేవి.   పరువు బరువుల ఎరువులు కాదు.

ప్రజాస్వామ్యంపై, చర్చపై, ఏమాత్రం విశ్వాసం లేని ఒక అహంకార ప్రధాని, ప్రజల అవసరాలపై అవగాహన లేని, లక్ష్యంలేని ఒక నిర్దయుడు, రోడ్డురోలర్ మెజారిటీతో మిడిసిపడే ఒక మెగలోమేనిక్ నాయకుడి బారినుండి దేశప్రజలకు రక్షణ నేటి అవసరం. అది 'దేశభక్తిపైని భక్తి'ని చేధించుకు వచ్చే నికార్సైన దేశభక్తితోనే సాధ్యం.  ప్రశ్నతోనే సాధ్యం.

ప్రశ్న వర్ధిల్లాలి. ఉలిపికట్టెలు విలసిల్లాలి. 

Thursday, October 13, 2016

డైలమా లేనివాడే డైలాన్ !

బాబ్ డైలాన్ కు సాహిత్య నోబుల్.

ఈ విషయంపై ఆయన స్పందన ఇంకా తెలీదు. ఇదే ఆయన!

తన ప్రతిష్ట పెరుగుతూ ఉంటే, జనం వెంటబడుతూ ఉంటే ఉప్పొంగి పోలేదాయన. లెజెండా సెలబ్రిటీయా అనే మీమాంస లేదతనికి. పొగడ్తలకు దూరంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రుషి.  ఇంగ్లండ్ కు చెందిన వాగ్గేయకారుడు బాబ్ గెల్డాఫ్ లా ఇతనికీ బతికున్నపుడూ, పోయిన తర్వాతా కీర్తి తీరాల మోహం లేదు.

గుండెకోతలూ, మోసాలూ, అకాల మరణాలు, అనైతికత, పౌర హక్కులు, పేదరికం, అణచివేత - ఇవి ఆయన ఇతివృత్తాలు. కళ పరిధిని విస్తరించి, సంగీతానికి ప్రజా సాహిత్యం జోడించిన బాబ్ లానే ఆయనను వరించిన నోబెల్ కూడా తన పరిధిని విస్తరించుకుంది. సాహిత్యానికివ్వాల్సిన బహుమతి సంగీతానికి ఇచ్చి, ఈసారికి సాహితీవేత్తకు అవకాశం దొరక్కుండా చేశారన్న విమర్శలు వినవస్తున్నా... పూవుకు తావి అబ్బినట్టు... సంగీతానికి సాహిత్యాన్ని సమలంకృతం చేసిన బాబ్ డైలాన్ కు నోబెల్ పురస్కారం ఆయనకు మాత్రమే కాదు. నిజానికి ఆయన లక్ష్యపెట్టరు కూడా. ఇది ఆయన సృజనకు నేపథ్యాలైన ప్రజాజీవనానికిచ్చిన గుర్తింపు.

1962 నుంచి ఏకధాటిగా 54 ఏళ్ళపాటు తనను తాను సృష్టించుకుంటున్నాడు. తన సమాజాన్ని తానూ స్పృశిస్తున్నాడు. ప్రశ్నిస్తున్నాడు. అందుకే బాబ్ డైలాన్ ప్రజా కవిగాయకుడు.

కలాల యుద్ధసైనికులూ రండి
మారుతున్న కాలాన్ని
విశాల నయనాల వీక్షించండి


ప్రజా ప్రతినిధులూ వినండి
బయట యుద్ధం జరుగుతున్నది
దారికి అడ్డు తొలగండి


అంటారు 'For The Times They Are A-Changing' లో...




యెంత మారణహోమం సరిపోతుంది
ఫిరంగి గుళ్ళను నిషేధించడానికి

ఎంతకాలం నిరీక్షించాలి
స్వేచ్చావాయువులు పీల్చడానికి

ఎన్ని సార్లని తలతిప్పుకోవాలి
చుట్టూ అన్యాయాలను గమనించకుండడానికి

జనఘోష వినడానికి
ఎన్ని చెవులు కలిగుండాలి?

వేదన చెందుతారు 'Blowing In The Wind' లో...


యెంత మానవీయత? యెంత ప్రేమ?

భారతీయ, తెలుగు కవులూ కళాకారులారా?  వింటున్నారా?

మమేకమవుతారా జనంతో, లేక మీ వెలుగుజిలుగులలో చరిత్రహీన శలభాలుగా మసైపోతారా?! 

Tuesday, October 4, 2016

నిరాడంబరత ! 

"The cost of being a vegan is a whole lot higher than the cost of being a meat eater not only that but hardworking Americans who have to scrimp and scrape for everything a hard time buying the expensive stuff it takes to be a vegan."
- A netizen from the US

సింపుల్ లివింగ్, నిరాడంబరత్వం ... చాలా కాస్ట్లీ.  గాంధీగారు లండన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులకు వెళ్ళిన ప్రతిసారి పాలు తాగేందుకు మేకను వెంటబెట్టుకు వెళ్ళడం వల్ల కాంగ్రెస్ పార్టీకీ, బ్రిటిష్ ప్రభుత్వానికీ ఖర్చు ఎక్కువ అవడం మాత్రమే కాదు, లాజిస్టిక్ ప్రాబ్లంస్ చాలా ఉండేవట. కొంచెం కళ్ళు మూసుకుని ఊహించండి, ఎన్నెన్ని తంటాలు పడాలో, ఓ మిల్క్ డబ్బా కొనిపెట్టుకోవడం కంటే?!

ఇదే కాదు, 'నిరాడంబరత' అనేదే ఓ పెద్ద ట్రాప్, బహుదొడ్డ ట్రాష్. వారివల్ల ప్రత్యక్ష కష్టాలు పడడం మాత్రమే కాదు, వారి ఆ 'కీర్తి;ని కూడా జీవితాంతం మనం 'కోటబుల్ కోట్స్'గా చదువుకోవాల్సి వస్తుంది.

ఎవరి అడుగులలోనో నడవాల్సి వస్తుంది. మనం ఏమిటో మర్చిపోయి. అంతా ఫ్యాబ్రికేటెడ్ నాలెడ్జ్ తో మసలుకోవాల్సి వస్తుంది. ఎవరో అల్లే కల్లలకు మనం పందిరి కావలసి వస్తుంది.  వారిని విమర్శించే వారినుంచి వారినీ మననూ రక్షించుకోవడంకోసమే జీవితాన్ని వెచ్చించవలసి వస్తుంది.

వర్తమానంలో మనతో నడుస్తున్నవారినీ, భవిష్యత్తు రోజుల్నీ... గతకాలపు కీర్తిపరుల కళ్ళతో చూడాల్సి వస్తుంది. మొదటి చూపుకంటే ముందే, అంచనా వేయవలసి వస్తుంది. కొత్తదనం లేదు. ఛాలెంజ్ లేదు. నేర్చుకునేది లేదు. నిలవ విధ్వంసులలా మిగిలిపోవలసి వస్తుంది.

కాబట్టి... ఏ విలువలూ, ఏ ఇజాలూ సర్వకాల సర్వావస్తలకు పనికి రావు. అతి డైనమిక్ అయిన జీవనాన్ని ఎప్పటికపుడు పలవరించవలసిందే. పలకరించవలసిందే.

లేకపోతే, నిన్న అవుతాం. మన్నవుతాం.